జీవిత గమనంలో చీకటి కెరటాలను
కప్పుకొనినిరంతర మరణ ప్రయాణం చేస్తూ...
ఆనంద పుష్పాలను అన్వేషిస్తూ ఉంటుంది ....నా ఆత్మ !
మాలతీ లంతాంతాలతో నిన్ను అభిషేకించాలనీ...!
నీరెండిన నిశిలో...వెండి వెన్నెల కిరణాలను తనపై ఓంపుకొని...
మసక తెరల విద్యుద్దీపాల మధ్య చూపులను దిగేసి...
శూన్యంలోకి చూస్తూ ఉంటుంది....నా మనసు !
కాంక్ష నిండిన ఈ మదిని అతృతతో నీకర్పించాలనీ....!
జనన మరణ విస్తృతులు...... తనువుని స్పృశిస్తున్నా....
నిశ్శబ్దపు విషాద ఛాయలు మదిలో అలుముకుంటున్నా...
మౌనంగా ఎదురుచూస్తుంది.... నా ప్రాణం!
నా స్మృతి పదంలోకి నడిచి వస్తున్న నీకు స్వాగతం పలకాలనీ...!
తీయని కలల సెగల కన్నీటి ధారలతో...
తన పాదాలను తానే అభిషేకించుకుంటూ...
స్వప్న జగతిలో ఒక చిలిపి ఊహకీ ప్రాణం పోస్తుంది...నా నయనం...!
కళ్యాణ కాంతులు నిండిన కనులలో ప్రత్యక్ష మౌతావనీ...!
అందుకే....
నిశీధి నుండి నిశ్సబ్దం వరకు...
నాలోని సృజన శక్తి మేల్కొలిపిన నీ మనో రసాకృతికీ ....
నా కనురెప్పల్లో నీ ముఖాన్ని...రాగ స్నిగ్ద మలిసంజలా మార్చిన నీ కళాస్మృతికీ...
నా పాదాభివందనం...!
మట్టి పరిమళాన్ని కప్పుకొన్న ఈ పువ్వు ఇంక నేల రాలిన చింత లేదు నేస్తం...!
నిన్నటి వరకు... ప్రేమ... నేడు స్నేహం... అందుకే నీకీది అంకితం...
5 comments Posted by బుజ్జి at 11/16/2010 02:11:00 AM
వేల వేల ఆశల్ను అదృశ్యంగా భుజాన మూట కట్టుకుని...
ఏదో సాధించాలని తపనతొ హడావిడిగా ఈ లోకం వాకిట్లోకి ఊడిపడ్డాను...
ఆనందం కోసమో .. అనురాగం కోసమో..
సాగుతున్న ఈ జీవన ప్రయాణంలో ...
మధ్య మధ్య నీ మండుతున్న విశ్రాంతి భరించలేక ....
ఒక్కోసారి తనువును తగలబెడుతున్న వెలుగు కంటే...
కళ్ళు కనిపించనంత చీకటే నయమనిపించేలా చేసావు.. !
ఒకప్పుడు నీవిచ్చిన ఓదార్పు ఇప్పుడు నిన్ను నా భుజాలపై మోస్తుందని మరిచావు..!
నీ ఆలోచనల చితిలో కాలుతున్నది నేనే!!
నీ ఎడబాటు కొలిమిలో మండుతున్నది నేనే!!
కన్నీరు చింధిస్తున్న కళ్ళలో... ఏ స్వప్నం నీ భావాలను బంధీస్తుంది...!
మౌన నిశ్వాసాల నిట్టూర్పులలో... ఏ హృదయం నీ మదిలో మైత్రి దీపాలను వెలిగిస్తుంది.!
నిశి రాత్రిలో కరిగిపొయే నా జ్ఞాపకాలకు విలువ కట్టలేక....
నేను స్మరించే నీ పేరును నా పెదవి అంచుపై వెతకలేక...
నిస్సహాయతతో నిండిన నా హృదయాన్ని ఓదార్చలేక..
పేరాశతో నిండిన నీ హృదంతర దృగంతరతొ....
సరదాకీ... సభ్యతకీ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని చూస్తున్నావు...
కాంక్ష నిండిన కళ్ళతో మరో అమాయకుడిని వెతుకున్నావు....
నువ్వు బాధ పడినప్పుడు నా భుజం...
నువ్వు ఆనందపడినప్పుడు నా హృదయం...
ఎప్పుడు నీకు తోడుగా ఉంటాయని మర్చిపొయావు నేస్తం.....కాకపొతే...
క్షణాలని కాపలాగా పెట్టి ఈ నిరీక్షణ ఎందుకు ??
అలసటతో నిండిన నా గతానికీ ఈ అలజడి ఎందుకు...?
మరణించానని చింతించను... వెచ్చని నీ ఒడిలో నా శ్వాస ఆగితే...
దూరం ఎంత అని ఆలోచించను... నీ అడుగు వెంట నా అడుగు సాగితే...
ఇవ్వటానికి సంకోచించను .... చిరునవ్వు చెరగని నీ పెదవితో నా ప్రాణం కోరితే...
మరో మహొదయం నా కోసం ఉదయిస్తే.... మరో జన్మ నాకు మిగిలి ఉంటే...
నీ మమతానురాగాల కోసం ఎన్నిసార్లు అస్తమించడానికైనా నేను సిద్ధం!!
ఓ స్త్రీ !!...అర్పిస్తున్నాను...అభిమాన నీరాజనం !!!
4 comments Posted by బుజ్జి at 11/02/2010 02:28:00 AMస్త్రీ!!!
చిన్నప్పట్నుంచి వింటున్న పేరు...
కట్నం కుమ్ములాటలో.... ప్రేమ పేరు తో మరిగే విష కషాయం లో కరిగి....
సగం తిన్న కలల్ని నెమరేస్తూ... సగం చచ్చిన ప్రాణాల్ని జొకొట్టుకుంటున్నావు...!!!
కష్టాల బాధలలొ...బ్రతుకు సమరంతో కాంక్షా నీహారాల ఆశాసూర్యుడు ప్రతిఫలింపక...
చినిగిన స్వప్నపు సంచిలో... చితికిన ఆదర్శాలను తలుచుకుంటూ...
అర్ధాంగి ఆకారాన్ని అద్దంలొ చూసుకుంటూ...నిద్రపొతున్నావు...!!!
సహనం చెలికత్తెగా ... బాధలు అనే కలుపుమొక్కలను ఏరుతూ...
కన్నీళ్ళతో చేసే బ్రతుకు వ్యవసాయం స్త్రీ ...
ఏరుకుంటుంది పారేసుకున్న ధాన్యం కాదు...
వదనాన జారే స్వేదాంబుకణాలలో...మగవాడి పరువు తాలూకు గుర్తులు...!
తనకన్ని తేదీలు గుర్తుంటాయి ... తన పుట్టినరోజు తప్ప...!
ఎందుకంటే...
బ్రతుకు పొగలతో ఆమె జీవితపు క్యాలెండరు మసి బారిపొయింది...
నీ బ్రతుకుని మాకు మెతుకులుగా తినిపిస్తూ... పస్తులున్న పడతీగా మిగిలిపొయింది....
ఒక్కటి మాత్రం నిజం ...
మనిషి గతం లో " తను" ఉంది...
వర్తమానం లో "తను" ఉంది....
భవిష్యత్తు లో కూడా "అతను" లో అన్నీ "తను" అయిన విజేతగా నిలుస్తుంది... ఈ వనిత...
ఈ లొకం అంతటా నరకాశురులే...
మరి సత్యభామలా ఎన్ని యుద్ధాలు చేయ్యవల్సివస్తుందో...??
అందుకే ....ఓ స్త్రీ !!
నీవు నిర్మించుకున్న ఆశాచంద్రశాలలో...
ధైర్యమే ఒక కవచంగా సాగుతున్ననీకు...
అర్పిస్తున్నాను...అభిమాన నీరాజనం !!!
సమర్పిస్తున్నాను...మమకార సిరి చందనం !!!!