మరణిస్తున్నాను మన్నించు నేస్తం....

శరీరంతో అనుక్షణం...మనసుతో ప్రతిక్షణం ...

నేడు రేపుల మధ్య నలుగుతున్న...నీలి ఘటనా దృశ్యాల మధ్య ...

ఒంటరిగా నేను..అచేతనంగా.. నవ్వుకుంటూ...

మరణిస్తున్నాను మన్నించు నేస్తం..!!

స్వప్నాలు ఆగిపొతున్నా...కెరటాలు కదలనంటున్నా ...

ఆదర్శం అణగనంటున్నా ... నాకంటూ ఎవ్వరు మిగలనంటున్నా...

ఈ మానసిక ప్రయాణం ...శబ్ద సమూహాల వద్ద చేరి ...

ఆత్మసంఘర్షణల మధ్య ..కన్నీటితో...

మరణిస్తున్నాను మన్నించు నేస్తం..!!

ఆనందం కోసమో ..అనురాగం కోసమో...

సాగుతున్న ఈ జీవన ప్రయాణంలో...

మధ్య మధ్య మండుతున్న ఈ విశ్రాంతి భరించలేక....

నిత్యం నన్ను తగలబేడుతున్న వెలుగు కంటే...

కళ్ళు కనిపించనంత చీకటే నయమనిపిస్తుంటే...

తట్టుకోలేక మరణిస్తున్నాను మన్నించు నేస్తం..!!

జననానికి మరణానికి నడుమ మిగిలేది...

ఒకే ఒక కన్నీటి పంక్తి మాత్రమే...

నలుదిక్కులనుండి చేయి చాస్తున్నది...

ఎపుడో ఒక నాటి నవ్వు మాత్రమే...

అందుకే...

దేన్నీ ఆహ్వానించలేక...అలాగని త్యజించలేక...

నాలో ఉన్నా నీతో బతికే ధైర్యం లేక...

మరణిస్తున్నాను మన్నించు నేస్తం..!!



యుగయుగానికీ స్వభావం మారుస్తున్నాడు...


కన్పించని ప్రలొభాలకు మనిషి లొంగుతున్నాడు...


నాడు జాతికి... ప్రగతికీ కనబడని విపత్తులు...


మన వేషభాషలు.. మన సంస్కృతులు...


అఖండ వసుధైక రూపాన్ని ధరిస్తున్నాయి...


నేడు పరభాషకు... మన భాషకు వచ్చే మార్పును


ఈ జగత్తు...సిగ్గిలిన సొగకళ్లతొ కొత్త భాషలొ అక్షరాలను మౌనంగా దిద్దుతుంది...


ఏ దేశ భాష అయినా ఏనాడు కాదొక స్ధిరబిందువు...


నదీనదాలు అదృశ్యంగా కలిసిన అంతస్సింధువు...


భాషకు ఆదర్మాలు లేవు.. ఆశయాలు లేవు...


పరభాష ధూళిని చల్లుతూ...మన భాషను మలినం చేసుకుంటూ...


సంతత ప్రకాశంగా వెలిగే తెలుగునూ...


దీపపు చీవర నిప్పు నలుసులా అర్ధవిహీనంగా ఆపేస్తున్నాము...


ఎదురపడిన వాళ్ళను పరభాషలొ పలకరిస్తే...వైభవమని గర్వపడుతూ...


పాశ్చత్య నాగరికత నగ్నత్వంలొకి చూస్తూ....


మారుతున్న పర సంస్కృతి సుందరిని కౌగిలించుకుంటున్నాము...


ఇన్నేళ్ళ తర్వాత...


శిశిర వసంతాల మధ్య వచ్చే విచిత్ర మధురమైన మార్పుని గుర్తుకు తెస్తొంది ....


ఎవరు ప్రత్యూషపవనాలలొ మన జాతి గౌరవాన్ని... లతాంతాలుగా వెలిగిస్తారు...?


ఏ అక్షాంశరేఖలమీద నిలిచి.. దిగాంతాలకు మన తెలుగు కీర్తిని చాటుతారు...?


మళ్ళీ మంచి రొజులు రావాలని...


పాత బట్టలుగా మూట కట్టిన మన తెలుగు పరువుప్రతిష్టలను...


ఒక స్మృత్యాగ్ని కణంలా నలుదిక్కులలొ వెలిగిస్తూ...


నిశ్మబ్ద నదీతీరాలలొ పలకరించే శుక్తిగత మౌక్తికంలాగ నిలవాలని ఆశీస్తున్నాను....



నా అక్షరాలు...జాజిపువ్వుల అత్తరు దీపాలలో...


మంత్ర లొకపు మణి స్తంభాలలో...


నాకే తెలియని సుందర విచిత్రాలు...


నిశ్శబ్దంగా... కన్నీటి కలం నుండి జారుతూ...


మది కాగితం మీద కదులుతున్నాయి...


నా అక్షరాలు...విరహ నిద్రా పరిష్వంగంలొ...


చీకటి నవ్వుల్లొ వెలుతురు చిందీస్తూ...


వాకిట నవ్విన వేకువలొ తులసిని చిగురీస్తూ...


కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలుగా...


ప్రజాశక్తుల వహించే విజయఐరావతాలుగా...


వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలుగా...


వెండి కెరటాలలో... చందనశాలా చిత్రాలుగా...మారుతున్నాయి...


ఇది అంతా నీ మాయే కదా నేస్తం..!




ఎవరు నేస్తం నీవు?

చినుకు చినుకు కలిసి చిరునవ్వును తడిపినట్లు

ఆకు ఆకు కలిసి కొమ్మల కాంతలపై

అత్తరు సుతారంగా అద్దినట్లున్న ఉషోదయంలో నులి వెచ్చని తొలి వేసవివా?

గుండె కవాటాలను తడుముకుంటున్న నిముషంలో

గగనమంత హృదయంలో దాచుకున్న రుగ్ధ వర్ణానివా?

నిద్ర తన ప్రగాఢ పరిష్వంగంలో మరచిపోయిన

కలల కుంచెతో దిద్దిన నిట్టూర్పు మంచుశిలవా?

అందెల ఆకాశ౦లొ... తెలి మబ్బుల చారల వలయంలో ...

వెండి వెన్నెలగా మెరుస్తున్న నక్షత్రాల జరీ అంచువా?

గదిలోని సగం కాలిన అగరవత్తుల కొనలు అలిగి ఆవిరవుతుంటే

అంధకారపు అరమోడ్పు కనులను మూసిన ధవళ వస్త్రానివా?

అంతులేని అవిశ్రాంతమయిన అవనిపై వాలిన చెరగని ధరహాసనివా?

కాంతి కిరణాల్ని చూపుతున్నవెలుగుల విభుదివా?

నిరాశను కదిలించిన శుబాభినవ ప్రభాతానివా?

మౌనంగా భరించే మలయ మారుతపు చిహ్నానివా?

అదృశ్య స్వర్గాల్ని... అశ్రుత గాంధర్వాన్ని...

అన్వేషించుకుంటూ అలల అంతరంగానివా?

ఇంతకి ఎవరు నేస్తం నీవు ?

;;