వెన్నెలనీ వేడెక్కించే నా చూపుల నిట్టూర్పులు...


శూన్యంలో మిగిలిపొతే ఏంటీ....


నీ వలపుల దూరాన్నీ ముడివేసుకున్న...


నా హృదయ స్పందన ఎప్పుడూ...నీకు విన్పిస్తూనే ఉంటుంది.... !


నా జ్ఞాపకాల నెమలి కన్నుకు... జీవం లేకపొతే ఏంటీ....


పాత పుస్తకం పేజీల మధ్యప్రత్యక్షం అయినపుడల్లా... నీ కధ చెప్పుతూనే ఉంటుంది...!


కదులుతున్న గడియారం శబ్దంతో... అసంతృప్తిగా ఆగిపొయే కధకు...


ముగింపు మరణమని తెలిసినా కూడా....


ఎందుకో ఆ పుస్తకం తెరవాలనిపిస్తుంది... మళ్ళీ మళ్ళీ నీ కధే వినాలనిపిస్తుందిరా....





కార్తెలు కరిగిపొతున్న.... కారు మబ్బులు కరగట్లేదు....


రుతురాగం లయ తప్పుతున్న... రైతు యాగంలో భయం పోవట్లేదు...


మైమరిపించాల్సిన తోలకరి .... మురిపించుకుంటుంటే...


ఆదుకోవల్సిన వర్షాసంధ్యని .... భూమాతపై అలుగుతుంటే...


స్తబ్ధతతో నిండిన నింగికి .... అన్నదాత ఆశా కర్పూర దీపాల్ని వెలిగిస్తున్నాడు...


భస్మీకృత ధాత్రిని కరుణించమని....చేతుల్ని జోడిస్తున్నాడు....


చిరుగంధ సువాసనలతో నిండాల్సిన ధరిత్రి....నేడు...


ఆకాశ ద్వారం దాటని చినుకులకై.... దృవగళాలెత్తి ఏడుస్తుంది....


పచ్చని పుడమిపై పగుళ్ళు చూడలేక....


జారిన అశృవులతో... ఎండిన పంటను తడపలేక....


ఈ విశాల గగనం మీద... గడిచిన శిశిరాన్ని తలచుకుంటూ...


ఆలోచనాంధకారంలో ఆకలిని ఆవిరిచేస్తున్నాడు....


దిక్కు... దిక్కుకు స్వాగత తోరణం కడుతూ...


చీకటి గదిలో మూల్గుతున్న ఆశను... రొజు తట్టి లేపుతూ....


కురియని వానలకు....తడవని హృదయంగా మిగిలిపొతున్నాడు....


అందుకే ....రా...


గతించిన కాల చరిత్రలో....అదృశ్యమైన మా జీవితశాఖలపై నిండిన....


మగత మేఘాల తెరలను తొలగిస్తూ....రాజర్షిలా... నిశ్శబ్దంగా వర్షించు....


దిగ్ర్భాంతంతో... బీడువారిన మా మదిపై...దేవర్షిలా....చిరుజల్లులను కురిపించు...


మీ రేవా....





మగువల గొప్పదనం లిఖించిన చరిత్ర పుటలలో...


మీ దేహం నుండి జారుతున్న ఒక్కోక్క వస్త్రంలా.....ఒక్కోక్క పేజి చిరిగిపొతుంది....


కామం వంటి కైపులు...ముగ్ధ స్నిగ్ధమైన ఆక్షర్షణలు...


తరుగుతున్న తనువులో... వైడూర్యాలుగా ఎంతకాలం వెలుగుతాయి...?


తొలి యౌవ్వనపు గుర్తులు...బాధ్యతలేని నగ్నత్వపు నడకలు...


కరిగిపొయే నీ వయ్యారపు మూర్తిలో ఎంతకాలం నిలుస్తాయి...'పూనం'?


వాడిన పువ్వులు పొగొట్టుకున్న మృగమద పరిమళాలు...


మహాలయ అమావాస్యతో సమానం...!


పట్టు పరికిణీతో...పదాహారణాల తెలుగుదనంతో కన్పించకపొయిన పర్వాలేదు.......


కాని పరదేశ స్తుతిలో... స్వకీయ సంస్కృతిని విస్మరిస్తూ...


కొరికలకీ... సంతృప్తికీ...మాటలకీ.. ఆచరణకీ...మనిషికీ... మనసుకీ...


నీ నగ్నలాలస పరువంతో... స్త్రీత్వపు కట్టుబాట్లును మాత్రం ఆహుతి చేయ్యకు....!


నగ్నత్వంతో నిండిన సిగ్గుల్నీ... వగల్నీ ఒలకబోసే నెరజాణతనంతో...


అర్ధరాత్రి ధియేటర్లలో... అర్ధనగ్న లాస్యానికి.. సెక్సీ హాస్యానికి...


స్వదేసియ సంస్కృతి జాకిట్లును విప్పుతూ...నీ వికృతి ఆనందాన్ని మాకు చూపకు...!


మాతృధాత్రి శిరసెత్తుకు తిరగలేక...సిగ్గుతో ముఖాన్ని చూపలేక....


ముంజేతులతో కన్నీళ్ళను తుడుచుకుంటుంది....


మనం కలలు కనే ప్రమద ఆదర్శాలు ఇవి కావని రొధిస్తుంది....


[ప్రమద = స్త్రీ]






స్వప్నావస్ధ నుండి... జాగ్రదవస్ధ వరకు....మది పగ్గాలను లాగుతూ...


చావు పుట్టుకల చక్రాలను తిప్పే నీకు మరణమా... బాబా...!


దయార్ధ హృదయంతో...జగత్తు అనిత్యత్వమును గ్రహించిన....


సర్వాంతర్యామి అయిన భగవత్తత్వకు మృత్యుభయమా....!


నిర్గుణ స్వరూపంతో...ఆత్మసంధానం చేస్తున్నశుద్ధ చైతన్య మూర్తికీ అంత్యకాలమా...?


నిరాసక్తమైన మనస్సుతో...చింతారహితుడివైన మహాపురుషుడికి దుఖ:భారమా....?


ఏంటి బాబా ఈ మాయా...!


నిష్కల్మష భక్తిభావాలకు బానిసనైన నేను.... నీకు బుణగ్రస్ధుడిని...


అమృతతుల్యమైన భవ సాగరాన్నీ హారించటంలో... నీవు నాకు ఆగస్తుడివి....


దాతృత్వముతో నిండిన నీ చరణారవిందంలే... సర్వస్యశరణాగతికి మౌన ప్రబొధాలు.....


ముముక్షతతో నిండిన నీ పాదసేవలే...అనన్యమైన త్రివేణీ ప్రయాగల స్ధాన ఫలలాలు...


నీ మది కోళంబాలో... నిరాశానిస్పృహలకు తావులేదు....


ఎందుకంటే... ఆత్మజ్ఞానము నీ గని... దివ్యానందం నీ ఉనికి...


సమస్త చేతన చేతనంలలో నిండిన అజ్ఞామనే మగతను తొలిగించే అంశుధరుడువు...


నిప్పుకణములవంటి అక్షులతో..నిత్యగ్నిహొత్రివలే మా అంతరాత్మలో వెలిగే వైధాత్రుడువు...


ఏకాత్మభావంతో....నా మది అభంగములలో నీ నామము లిఖిస్తూ....


నా దయార్ధహృదయంలో...ద్విగుణీకృత ప్రకాశంతో నిండిన ....


నిర్వ్యామోహమైన నీ ప్రతిమకు ప్రణతినర్పిస్తున్నాను....


అష్టసాత్త్వికలతో పూజిస్తూ....రిక్త హస్తములను జోడిస్తూ....కారుణ్యంతో స్మరిస్తున్నాను...


నా ఆత్మకు యజమానివి... నా బుద్ధికి సారధీవి....


నీ ప్రేమ అనిర్వచనీయం...నీ ఆజ్ఞా అనుల్లంఘనీయం...


నీ ఊదీ వివేకం... నా దక్షిణ వైరాగ్యం....


రేవా...



అంశుధరుడు = సూర్యుడు


వైధాత్రుడు = బ్రహ్మ కుమారుడు


ప్రణతి = నమస్కారం


కోళంబా = పాత్ర


అభంగము = పేజిలు




క్షణాలలో... చూపులు కలుసుకొని... నిమిషాల్లో... కలవరింత మొదలవుతాయి...


మాట పెదవి దాటకపొయినా... మనసు కొత్త ఊసులుతో మారం చేస్తాయి...


అనుక్షణం ఆ తలపులే మదిలో సవ్వడి చేస్తుంటే...


ఇన్నేళ్లైనా క్షణం క్రితమే జరిగినట్లుగా.... ఆమె జ్ఞాపకాలుకొత్తగా నా మదిని తడుముతున్నాయి....


క్షణం ఆలస్యమైనా నిరీక్షించలేనంటూ... హృదయం... ఆరాటంతో మారాం చేస్తుంటే...


పాత జ్ఞాపకాలతో...వేసే ప్రతి అడుగు... ఆమె ఊహలుగా మదిలో ఆవిర్భవిస్తున్నాయి...


ఇది సృష్టించే ఉద్వేగాలు అనన్యం... అనంతం... అందుకే...


ఈ ప్రేమానుబంధం...అవ్యక్తం... అనిర్వచనం...


భావాల ఉరవడిలో తేలిపొవడానికి ఓ తోడు కావాలి...


తమ ఉచ్ఛాస ... నిశ్వాసకు... శ్వాసగా నిలిచే నేస్తం రావాలి...


భాష వేరైనా అనుబంధాలు ఒక్కటవ్వాలి....


ఆ అలజడుల భావాలను ఒడిసి పట్టి... స్వప్నాల సంచిలో బంధిస్తూ...


అంతరంగపు ఆలోచనలలో తెరలు తెరలుగా వస్తున్న కన్నీటినీ తుడుస్తూ..


తన స్నిగ్ధ కపొల తల్పానలో ముద్దాడిన పియసఖుడిగా మిగిలిపొవాలి....


మనసుల...కలయికే కాదు...నేస్తం... ఆత్మీయతల కలబోతలు కూడ ఉండాలి...


బ్రతుకు ఆనంద లొగిలిలో...మమతాను బంధాలు... నందనవనం కావాలి...


"ప్రేమికుల రొజు ... శుభాకాంక్షలతో... మీ రేవా...!



నాలో నేను తర్కించుకునే వేళ...


నాదైన జీవితం ప్రగతి నినాదమై నన్ను శాసిస్తుంది...


నాలో నేను అన్వేషిస్తున్న వేళ...


నాది కాని బ్రతుకు హెచ్చుతగ్గుల్ని లెక్కలేస్తుంది...


శోధిస్తే గాని లభ్యమవదని తెల్సి కూడా నాలోని అహం...


వెళ్ళీపొయే చీకటిని వదలలేక దీపం...


వదలిపొయే బ్రతుకును వీడలేక ప్రాణం...


మదినీ ద్వేషిస్తునే ఉంటున్నాయి...


అందని అనురాగం కోసం... అలమటించే ఆలాపనం ఎందుకని...


నిరంతరం నన్ను ప్రశ్నలతో వేధిస్తూనే ఉంటాయి....


మీ రాజ భవనపు పునాదుల్లో...


కుప్పలు కుప్పలుగా పేర్చబడిన ఎముకలు ఎవ్వరివీ...?


మీ ఇంట్లో పేరుకుపోయిన నోట్లకట్టల పై ...


తడి ఆరని చెమట చుక్కలు ఎవరివీ...?


కదలలేని కాలంలో... తెల్లబొయిన మానవత్వపు దీన దృశ్యాలును చూద్దాం రా...!


పాప పుణ్యాల జమాబందిలో... మీది ఏ జన్మనేది తేల్చుకుందాం రా....!


మీ గుండెనీ శోభింపచేసుకుంటూ... పేదరికాన్ని స్పందిచకపొయిన పర్వాలేదు...నేస్తం...


కనీసంబాధని కని కరుణతో కన్నీరైన విడుద్దాం....


మార్చవలసింది మనమే... మారవలసిందీ మనమే అని గ్రహించలేక...


ఓటమి అనే శాపాన్ని ఓర్చుకోక పొతే...గెలుపు అనే వరం రాదనీ....


కష్టాల జలధిలో ఈదితేనే... సుఖాల నావకి చేరుకోలేమనీ....


ఎప్పుడో చిన్ననాటి మాటలనూ...వళ్ళీస్తూ....


చీలిన జీవితాలపై నల్లని విస్మృతీ దుప్పటిని కప్పేస్తున్నాం....


నా నిశ్శబ్దపు దీపాలలో మిణుకుమనే... జ్ఞాపకాలు ఒక్కొక్కటిగా రూపుమాసిపోక ముందే...


మనమయినా మనుషుల్లా బ్రతకడం అలవాటు చేసుకుందాం... మీ రేవా...!



నేను చూసాను నేస్తం...!

చనిపోతే గానీ చల్లారని పగలనీ....ఎంత సంపాదించుకున్నా తీరని ఆశలనీ...!

నేను చూసాను నేస్తం...!

శూన్యతలో కరిగిపొయే కాలాన్నీ...నరనరాలలో చొచ్చుబడిన చైతన్యానీ...!

నేను చూసాను నేస్తం...

మభ్యపేట్టే మాటల మంటల్లో.... కాలిపోతున్న బలహీనుడి బ్రతుకునీ...

ఆస్తుల విలువల కోసం.... వారసుల భవిత కోసం...

రాక్షస పాదంతో తొక్కేస్తున్న పేదవాడి బ్రతుకునీ...!

మన తల్లి పూతన కాదు నేస్తం... విషపు పాలు ఇచ్చి చంపటానికీ...

మన నాన్న...కంసుని అంశలో పుట్టిలేదురా...అమృతం తాగి...అమ్మ రొమ్ము చీల్చిటానికీ...

విడిపోతే తప్ప బ్రతుకులేదనే ఆక్రందనలతో...

పేదోడికి ఏనాడూ అందని జీవనప్రమాణాలు ఎందుకు...?

ఒక్క జాతిగా ఏనాడూ ఒప్పుకోని ఈ జనంకులమతాలా...

పేర్లతో అవసరాల కోసం ఒక్కటీగా కలిపొవటం... ఎందుకు...?

మీరు చేస్తున్న రాజకీయాలలో ఎండిపోతున్న జీవితాలెవ్వరివి..?

మృత్యు కాటకములో... చిక్కుకున్న బ్రతుకులేవ్వరివి..?

ఇది ఏ బాధా నివారణకు... ఏ వాంఛా పరిపూర్తి కొరకు...?

పున్నమి నాటి వాళ్ళ బ్రతుకులో వెన్నెలను... అమావాస్య వరకు దాచలేక...

నిర్ధయుణ్ణీలా... నీరసుణ్ణీలా...ఎదను కలచవేసే ఈ దృష్యాలను చూస్తూ...

పాతబడిన నా ప్రాణంతో... మట్టిశిల్పంలా మిగిలిపొయాను...... రేవా...





ఆశల గూటిలో కనుపాపలు....విశ్రాంతి కోసం ఆవులిస్తున్నప్పుడు...


ఏకాంత మందిరంలోనే నిత్యం ఉండిపోవాలనే...


నా ఆనవాళ్ళ వలయాలు నన్ను శాసిస్తున్నప్పుడు....


హృదయ తంత్రుల మీద వచ్చి చేరిన నీ పలకరింపు.....


మూగవోయిన నా మనోఫలకంపై చెరగని ముద్ర వేసి....


ఒంటరి వేదిక మీద రాత్రంతా మాట్లాడుతూనే ఉంది.....నేస్తం..!


ఉహల్లో తప్ప జీవితం గూర్చి...తలపునకు రాని నాకు....


నీ చిరునవ్వు వాస్తవంలో ప్రతిబింబిస్తూ....


మన మధ్య సందిగ్ధ వారథిని దాటించిన తీరు.....


అభిమానమో.. ఆత్మీయతా బంధమో .. అనురాగమో...


ఏదో తెలియని ఒక స్పర్శ.... అలలా తాకి...


అంతుచిక్కని భావమేదో.... మనసుల్ని దరిచేర్చి...


హృదయాంతరాలలో... అంతరించిపోయిన...


నా ఆశయాన్నివెలికి తీసింది..నేస్తం...


ఇది నిజం...


ఈ జన్మకు నేను నీకై నిరీక్షించే గుండెను మాత్రమే...


మరో జన్మంటూ ఉంటే...


నిత్యం పరిమళభరితంగా జీవం పోసుకునే నీ ముందు పద్మప్రభనై జన్మిస్తా.....


విశ్వమంతా 'నువ్వే నా లోకం' అని చాటి చెబుతా..!





జ్ఞాపకాల అజ్ఞాతంలో నాది ఏకాంత వాసం..


జీవితం... భ్రమలో బతికేయడం నా విశ్వాసం...


ఆత్మీయత లేని అమ్మతనంలా...


క్షణాల నీడల్ని దాటి రావాలనే...ఆతృతలో కనబడుతోంది అలసిపొయిన నా జీవితం...


ఒక జీవితం... ఒక జన్మకే.. పరిమితం అనుకుంటున్నాం....


మరణించడానికే... జన్మిస్తున్నామనే సంగతిని మరచిపోతున్నాం..!


ఎన్నో ఆశయాలతో.. ఆశలతో... 'నా' అన్న ఆనవాళ్ళను వద్దంటాం... కాదన్నవారినే అనుసరిస్తాం...


భావావేశాలను కొల్పోతూ... ఉద్విగ్నతకు గురవుతూ...


అనుకోకుండా ఆనవాలు కోల్పోతున్న దృశ్యాలెన్నో...


కనబడకుండానే కనుమరుగైపోతున్న బంధాలెన్నో...నేను చూసాను...నేస్తం...!


ఆదిలేని చరిత్రలో... అంతం లేని నా యాత్రలో...


నా కోసం నువ్వు నడిస్తే అది భౌతికత్వం...


నీ కోసం నేను నడిస్తే అది శాశ్వతత్వం....




కనురెప్పల అంచున చేరిన కన్నీటి చుక్క...


చెక్కిలి నుండి జారి అధరాలలో ఐక్యమవాళ్ళనుకుంది...


కానీ....'ఇన్నాళ్ళూ తనను దాచుకున్న కన్నుకి...


తాను దూరమైపోతే ఏమౌతుందో అనే కలతతో వెంటనే....


రెప్పల అంచు నుండి కంటిలోనికి జారి ఇనికిపోయింది....నేస్తం....!


ఆ 'కంటిచుక్క' చేసిన పునరాలోచన నీవూ చేసిచూడు...


నీ చూపుల వాన కురియక బీటలు పడిన నా గుండె కనిపిస్తుంది....


ఎండిన రక్తంతో ఊపిరందక కొట్టుకుంటూ...




గడచిపోయిన నా బాల్యాన్ని కరిగిపోయిన కలల్లో ఆవిష్కరించలేను...


మాయమైపోయిన అనుభూతుల్ని... అపురూపమైన యువ్వనంతో...


అవలోకనం చేసుకోలేను....తీపి చేదు అనుభవాల సతమతంలో....


ముడతలు పడ్డ ఈ ముసలితనానీ....నా ముఖ కవళికలలో చూపించలేను...


కనబడని ...వినబడని... కనీసం ఆనవాళ్ళు సైతం లేని నా బాల్యాన్ని చూసి....


ఆనందంతో వెల్గిపోతున్న నా గతాన్ని ఆస్వాదించలేను....


విధి లిఖించిన వెర్రి చిత్రం వలే ఎండిన నా బ్రతుకునీ...


కాలరేఖ తీరాన ఉదయింపలేను...


శూన్యంలో... శూన్యతలా...పాతబడిపోయిన ఈ జీవితంలో...


కాంక్ష తప్తమైన... ప్రతి సంధ్యా... నాకు పాత సంధ్యే గానే మిగిలిపొయింది...


బాంధవ్యాలలో... అనుబంధంలా...నలిగిపొయిన ఈ నిట్టూర్పులలో...


చంద్రికాస్నపితమైన...ప్రతి స్వప్నం... నాకు పాత స్వప్నం గానే నిలిచిపొయింది...


శిసిర వసంతాలను అస్వాదిస్తూ...


నలుపు చారలు లేని... తెలుపు కాంతుల మధ్య పెరిగిన మీకేం తెలుసు నా జీవితం విలువ...


మౌనంగా ఉన్న దీపాల్ని ఊపుతూ....


చిరు చీకటి పలకలమీద రేడియం అక్షరాలను వ్రాసుకునే మీకేం తెలుసు నా బాల్యం విలువ...



వీరభద్రుడు...రుద్రాంశ సంభూతుడు...

విధ్వంసకారుడు.. అగ్రహొదగ్రుడు...

రాగి కురుల సంభూతుడు...భగ భగ మండే నిప్పుల రౌద్రుడు...

నగ సుతకు సగ దేహాన్ని కల్పించిన ఉమాశంకరుడు...

ప్రళయకాల రుద్రుడు... మా వ్యోమకేశుడు....

ఆగరు పొగల ధూపం లోని పవిత్రత...

విభూది... చందనవన...సురభిళ... పరిమళాల ప్రశాంతత...

వైశాఖ మాసపు వాన జల్లుల్లోనీ ఆహ్లాదం...

లేలేత తమలపాకు మీది పసుపు గణపతిని చూసినప్పటి భక్తి భావం...

మంత్ర పుష్పం వింటున్నప్పుడు కలిగే పారవశ్యం...

చంపక...అశోక..పున్నాగ పుష్పాల అలంకరణలోని అందం..... మా ద్రాక్షయణి సొంతం....

మౌనం... ద్యానంతో అధరాలపై విచ్చుకున్న చిరునవ్వులతో...

నీలకంఠుని కౌగిలిలో... పారవశ్య ధాత్రీమదవతి... మా పార్వతి...

వారి తల ఆలోచనకు అలంబనమైతే... పాదాలు ఆచరణకు సంకేతమౌతాయి...

భూషణ భుజంగం...రత్నగ్రేవేయ హరం...

ఆహార్యం విభిన్నం...అపాదమస్తకం ఒకే రూపం...

అన్యోన్యతకు ఆది దంపతులు...భార్య భర్తల అనుబంధాలకు అర్ధ నారీశ్వరులు...

"శివరాత్రి శుభాకాంక్షలతో... మీ రేవా...!




సాధించిన దానితో సంతృప్తి పడటం..విజయ స్వాప్నికుల లక్షణం కాదు...


కృంగించిన ఓటమితో నిరాశ పడటం ... గెలుపు చైతన్యాలకు ప్రతీక కాదు...


ప్రగతి చాటున అణిచివేతలు...వేధింపులు ఇంకా తగ్గనే లేదు....


బాల్య వివాహాలతో..బతుకు బండలు చేసే సంస్కృతిని ఇంకా పొనే లేదు...


అయితేనేం....


ఆకాశం మిరుమిట్లు గొలిపే కాంతి పుంజంలా... విధుల్లో అగ్గి బరాటాల్లా వెలిగిపొతున్నారు...


వేల గొంతులు ఒక్కటైన స్వర ఘరిలా...సమస్యలను ఛేదించటంలో అగ్నిశిఖలా జ్వలిస్తున్నారు....


సవాళ్ళును అధిగమిస్తూ...సాధించాల్సిన లక్ష్యాలను గుర్తు చేసుకుంటూ...


చేరుకొవల్సిన గమ్యాలకు బాటలు వేస్తున్నారు.....


ఎంత ఓడిపొయామ అన్నది కాకుండా...


ఎంత కొల్పొయామ... అన్నది సమీక్షించుకుంటూ...


ధగా పడిన జీవితాలపై పొరాటం ప్రకటిస్తున్నారు...


వాస్తవాలను అవగతం చేసుకుంటూ...సరిహద్దుల్లో పహరా కాస్తూ..


సాహస విధులకు సైతం .. సై అంటున్నారు...


కష్టాలలో ఓదార్పు తప్పా... మీ కన్నీటికి భాష రాదు....


ఆనందపు అలలు కొట్టుకు పొయినా... మీ ఆశయానికి.. బాధ లేదు... ఎందుకంటే...


ఆత్మవిశ్వాసాన్ని ఆవిష్కృతం చేస్తూ... శూన్యతతో నిండిన చీకటిని తరుముతూ...


విజయం సాధించాలనే తపనతో రగిలిపొతున్నారు.. ...!


అందుకే... మగువలందరికీ...మహిళ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను..... మీ రేవా...






నా జీవితపు విలువలను... నీ ఆత్మ విశ్వాసంతో...ఆవిష్కృతం చేద్దామనుకున్నాను...



కాని ఈ రాత్రి మూగ సైగలతో మేల్కోన్న... నిరాశతో మాట్లాడుతున్నాను ఏంటీ..?



నైరాశ్యం... నిస్పృహలతో నిండిన....ఈ పాత కాలపు గుండెను నీకర్పిద్దామనుకున్నాను..


కాని నిస్సహాయతతో నిండి ఈ చీకటీలో...విధి లిఖించిన వెర్రి చిత్రంలా మిగిలిపొయానేంటీ...?


పక్షవాతపు మంచం కౌగిలింతలో... చెదలు పట్టిన భాగవతంలా...


గత చరిత్ర బురదలో కూరికుపొయిన.... బిలహరి రాగంలా....


నువ్వు నన్ను ఎప్పుడూ అర్ధం చేసుకోలేవు... నేస్తం...!


స్త్రీ హృదయం అద్వయతంలా....ఎనాడు ఎవరికి అర్ధం కాదని మరో సారి నిరూపించావు....


వాన వెలిసాక గొడుగు... మది గాయపడ్డాక నీ అడుగు... ఎందుకు నేస్తం...


తీక్షణ... వీక్షణల్లో... హృదయతూణీరంలో...


నాలో నేను...ఈ నిశ్శబ్దపు యుద్ధం చేయ్యలేక...


చెదిరిన స్వప్నాలను... బాష్పాలుగా మారుస్తూ.... ఎదబీడుని తడుపుతున్నాను....


ఒంటరితనంలో ఇమడలేక... ఆవహించిన ఏకాంతపు మౌనంతో బ్రతకలేక...


దిశా నిర్దేశం లేని... నిరాసక్త తీరాలకు పయనిస్తున్నాను....


ఆశ నిరాశ ఊహాల ఊగిసలాటలో...నీ వేడి చూపులు....


నా జ్ఞాపకాల తెరలను చీల్చుతున్నాయి..


అడుగడుగున ప్రతి కదలికలో... అనంతమైన నీ ఆలోచనలు నన్ను వేదిస్తునే ఉన్నాయి....


అతృత్ప అశాంత అంతరంగాలైన నా తనువు...


కాంక్ష లాసజ్య కౌగిలితో నిండి నీ స్త్రీత్వము నేడు ఏమైంది....


అపార కృపా తరంగితాలైన ఆనాటి నీ స్నిగ్ధ దరహాస పరిమళాలు నేడు...ఏమైయ్యాయి...


నీ సంచలనాత్మక ఆలోచనలతో...నిత్యం నన్ను వేధిస్తున్న....


నన్ను అంటిపెట్టుకొన్న ఆత్మకు... కొత్త ఆశతో ప్రాణం పొస్తావని....


నా సుప్త సౌందర్యపు హృదయంలో...


నీ భావాల దారలతో నన్ను అల్లుకుంటావని... ఎదురుచూస్తున్నాను....!



పంజరంలో తలుపేసుకుని... భావాలకు ముసుగేసుకుని..

ఊహాల రెక్కలు కోసేసుకుని...మార్పు అనే తూర్పు వైపు చూడకుండా ఎన్నాళ్ళీలా....?

చీకటినే... వెలుగని భ్రమిస్తూ...సుదీర్ఘ సుషుప్తస్ధితి లోనే చైతన్యం ఉందని నమ్మేస్తూ...

బావిలో కప్పలా బ్రతుకేస్తూ.... ఎన్నేళ్ళీలా.... ?

పెనుగాలులు వీచినప్పుడు...మహా వృక్షాలు కూలిపొతాయి...

లేత మొక్కలు మాత్రం క్షేమంగా మిగిలిపొతాయి... ఎందుకో తెలుసా నేస్తం.....

చెట్లు మార్పును ఎదిరించే ప్రయత్నం చేస్తే....

మొక్కలు సవినయంగా తలవంచి స్వాగతిస్తాయి....

మన ఆలోచనలతో నిండిన లక్ష్యాల్నీ పునర్నిర్మించుకున్నప్పుడూ......

అర్హతలతో నిండిన నైపుణ్యాలు అవే బయటకు వస్తాయి....

ఆత్మవిశ్వాసంతో నిండిన గతాన్ని గౌరవిస్తూన్నప్పుడూ.....

వైఫల్యాలతో నిండిన అద్దాల గొడలు వాటికవే బద్దలవుతాయి...

స్వేచ్ఛలో స్వచ్ఛతనీ.... సృజనలో వికాసాన్నీ....

సహజ చలనంలో మార్పు మాధుర్యాన్ని.... చవిచూడలేక....

పాతబడిపొయిన ఆలోచన ధోరణితో....

జీవితాన్ని అనుభవించడంలో ఓడిపోతున్నాం....

గుప్పెడంత గుండె చెప్పే ఊసుల్ని...ఊ...కొట్టలేక...

మౌనం నుండి చైతన్య వాస్తవాలను వెలికితీస్తున్న....

మనసును... జయించడంలో ఓడిపోతున్నాం....!

ప్రశ్నించడం నా తత్వం...ఎందుకంటే .. నేను జిజ్ఞాసిని....

స్వార్ధం లోభం నిండిన లోకం ఆహ్వానిస్తే వచ్చిన అతిథిని....

ఓ సగటు మనిషిని.....!

ఆకలి....



ఐదు వేళ్ళు నోట్లోకి పోని.. అభాగ్యుడికి అన్నం కోసం ఆకలి...


కాలేజీకి వెళ్ళే అమ్మాయికి... ఆకర్షణ కోసం ఆకలి...


ఎదుగుతున్న కుర్రకారుకు అల్లరి కోసం ఆకలి....


చీరెల కోసం... నగల కోసం... గృహిణుల ఆకలి....


అందే జీతం కంటే... అందని గీతం కోసం...లంచగొండి... ఆకలి....


కోట్ల జనం కళ్ళి గప్పి... విభేదాలు రెచ్చగొట్టి...


దొరకని పదవుల కోసం... అమాయకుల బలి.. ఆకలి....


భరతమాత నా మాతృభూమి... భారతీయులంతా నా సహోదరులు...


అని రోజూ వల్లె వేసే...నోటితోనే.. నీది కాదు... నాదని తేడాలను సృష్టించే...


అస్ధిమూల పంజరాలు... ఆర్తరావ మందిరాలు...ఏన్నని చూపను...!


అందుకే ... ఈ రాత్రిలో... ధాత్రి నిశ్శబ్ధం కాకముందే....


ఈ నాగరికత మైలుపడిన దుప్పటిలా నన్ను కప్పుకొక ముందే...


రా.. ప్రశ్నించే నా మనస్సుకు ... బదులుగా...ఆధునిక...కలి మహత్యం... ఆ..కలి..కలిగా...!




శ్రమజీవి స్వేదానికి...


ఎర్రరంగు పూసిన రుదిరాన్ని... సిరాగా చూసినప్పుడు...


నా కలం కన్నీరు పెడుతుంది...


అభాగ్యురాలి...కన్నీటి కథ రాస్తున్నప్పుడు...


అగ్నిసాక్షిగ పెళ్ళాడినవాడు...అగ్నికి ఆహుతి చేసినప్పుడు...


నా కలం కన్నీరు పెడుతుంది...


అమాయకపు పసిపాపల...అపహరణ హత్యోదంతాలను రాస్తున్నప్పుడు....


వికసించే పువ్వులపైన...యాసిడ్ వర్షం కురిసినప్పుడు...


నా కలం కన్నీరు పెడుతుంది...


పసి మొగ్గలపై హత్య ప్రయత్నం జరిగినప్పుడు...


పరువానికి పడుపు వృతినే బహుమానంగా ఇచ్చినప్పుడు...


నా కలం కన్నీరు పెడుతుంది...


సస్యశ్యామలమైన అరణ్యాలు ఆక్రమణలకు గురై...


మానవతతో మెలగవలిసిన మనసులు ఎడారులుగా మారినప్పుడు...


నా కలం కన్నీరు పెడుతుంది...


తరాలెన్ని మారినా..యుగాలెన్ని గడిచినా..


కష్టజీవి కష్టాన్ని దళారి దోచేస్తుంటే..


బడుగుజీవి బతుకు పరాధీనమైనప్పుడు...


మనసున్న నా కలం ప్రతి రొజు కన్నీరు పెడుతునే ఉంది...


నేను కలంగా ఎందుకు పుట్టానని!


కవివర్యునిదో దు:ఖం ... కర్షకునిదో దు:ఖం...


బాల్యానిదో దు:ఖం... బాలెంతదో దు:ఖం!


దు:ఖానికి దు:ఖం ప్రత్యుత్తరం కాదు...


కన్నీటికి కన్నీరు ఉపశమనం కాదు...


నా ఏడ్పు ఎదుట వాడి విక్రయం....


నా నవ్వు ప్రక్కవాడి క్రయం!


ఒక మోదం... ఎన్ని జీవితాల ఆక్రందన...


ఒక రోదన... ఎన్ని బ్రతుకుల వేదన!


నీ చల్లని మాట సౌజన్యం...


నీ చల్లని చూపు సౌహార్దం...


కటాక్ష వీక్షణం...నిండారు అభయం!


దాక్షిణ్య దీవెన....ఆప్యాయతా స్పర్శ లాలన...అన్నీ నీ సొంతం నేస్తం...!






కారుణ్యం ప్రేమతత్వం నీలోనే నిక్షిప్తం చేస్తూ...

చరిత్ర విచిత్ర సముద్రాలలోకి చూస్తూ...



కాలతీరాన ఒంటరిగా నడుస్తున్నావు....



మొక్కవోని ధైర్యానికి శివాజీయే నిదర్శనం అయితే...



అది నింపిన జిజాబాయి కాదా తల్లులకు ఆదర్శం...



'తల్లి ఒడి - తొలి బడి' అను నానుడిని వినలేదా....



నిరూపించు తర్కాణం ఇది ఒక్కటి చాలదా... అమ్మ...



స్ఫూర్తి మూర్తివి నీవు... యుక్తి శక్తి నీ ఆయువు...



మాతృమూర్తిగ నిలిచే సామర్థ్యం నీ సొంతం...



ఓర్పుతో... సహనంతో...చేసే నీ త్యాగం వర్ణణాతీతం....



అందుకే నా కృతజ్ఞాతాంజలితో...



ఎన్ని జన్మలు ఉన్న....ప్రతి జన్మ నీకే పుట్టాలనీ...



నా కన్నీటితో నీ మృదుపాదాలను అభిషేకిస్తూ...



ఈ నా జన్మను నీకు అంకితమిస్తున్నాను... నీ రేవా.....






నీకు నాకు నడుమ అక్షరం ఆలంబన అయితే...

నా గుండెలో భావాలను లతాంతాలుగా మారుస్తాను...



కదులుతున్న కాలంలో నీ కలం కమనీయమయితే...



నిరీక్షించే నా కన్నులుకు నీ రమణీయతను చాటుతాను...



నువ్వు దోచుకెళ్ళిన నా మనసు గోడల మధ్య... నీ భావాలను బంధించ లేను...



నీ కోసమే కోటి ఆశలతో ఎదురు చూసే నా కనులలో... కన్నీరు చింధించలేను...



ఒకచోట నిలబడని నీ ఊహలు... ఒకనాటికి అంతమవుతాయని ఎలా అనుకున్నావు...!



ఒక్కక్షణం కూడ వీడని నీ జ్ఞాపకాలు... మరుక్షణంలోనే మాయమవుతాయని ఎలా ఊహించావు...!



ఒకేసారి పలకరించే అనురాగం....ఒకే క్షణంలో పోయే ప్రాణం నాకు వద్దు నేస్తం...



కదల లేక కదులుతున్న నా గుండె చప్పుడు హెచ్చరిస్తూనే ఉంటుంది...



వదల లేక వదులుతున్న నా హృదయ స్పందన బాధపడుతూనే ఉంటుంది....



చీకటిలాంటి దుఖ:న్నీ దిగమింగాలనీ...


మనసును చైతన్యం చేస్తూ... వెలుగు నీడలను చిత్రించాలనీ...


అందుకే....నా తలపుల్లొ ఒక్కో తలపు నీకు అంకితమిస్తూ...


నా అంతరంగంలో స్తంభించిన గుండెను నడిపిస్తూ...



నాకంటూ మిగిలిన స్వచ్ఛమైన నీ జ్ఞాపకాతో...



మానవత్వపు మహొదయంతో...ముందడుగు వేస్తున్నాను నాదైన నీదారిలో...



ఆక్రందన.... ఎన్నేళ్ళీ నయవంచన....


ఎంత వరకు ప్రయాణం... ఈ కర్కశ కామాందుల వంచనలో...


ఓ జులాయి ప్రేమ కాదంటే యాసిడే మాపై పన్నీరు...


ఈ విష ఉన్నాదుల సమూహంలో తడి ఆరవు మా కన్నీరు...


పరిణయ పారితోషకం తగ్గితే... కిరొసిన్ అవుతుంది మా ఒంటి పైన అత్తరు...


ఓపిక నశించి మాట పెగిలితే... వాతల గుర్తులతో జారుతుంది మా నెత్తురు...


కని పెంచిన కన్నవాడే...కరుణ లేని కసాయిగా మారుతుంటే....


మదం పట్టిన మామ గారే మమ్ము చెరపట్టగా చూస్తుంటే....


కలకాలం తోడు ఉండవలిసిన వాడే రాక్షసుడై భక్షిస్తుంటే......


అత్తా ఆడపడుచులే మా పాలిట ఆదిశక్తులై పీడిస్తుంటే....


నిత్యం నయవంచనకు బలి అవుతున్న మాకు మరణమే శరణమా...??


మాంగల్యం ముసుగులో మా మెడలో ఉరితాడే ఆభరణమా...??


చరిత్ర ఎండిన ఈ గొంతులో... పవిత్ర శాంతి సుధని ఏలా చిందించగలనూ...!


మృత్యువు కాటకము మోహరించిన ఆత్మతో....ఆక్రోశిస్తున్నా ఇల్లాల ఆవేదనని ఏలా తీర్చగలనూ..!


భారత జనయిత్రీ పదపూజా నవగీతావళి...


మహదాశయ మీ జీవనంలో రావాలి మళ్ళీ ఒక దీపావళీ... !



పున్నమిలో... వెన్నెలని వెతకాలా...?


నీశిలో... చీకటిని వెతకాలా...?


నేను స్మరించే నీ పేరును నా పెదవి అంచుపై వెతకాలా...?


నా ఊహలన్నీ నీ ఊసులుతో నింపిన నిన్ను... నా కనులలో వెతకాలా...?


నీ జ్ఞాపకాలలో జీవించే నన్ను.... నీలో వెతకాలా...?


మరిచిన ఆరొజుల్లొ మన స్నేహన్నీ వెతకాలా...? చెప్పు నేస్తం...?



ఆకులు రాలిన ఆశను... తట్టి లేపే వెచ్చని వసంతం నీ ప్రేమ...


కలలు కరిగిన కనులలొ... నిత్యం కదలాడే ఊహల చిత్రం నీ ప్రేమ...


సిగ్గుతో ఎరుపెక్కిన సూర్యుడు సిగలో విరిసిన మమతల దీపం నీ ప్రేమ...


అడుగంటిన ఆశల ఎడారిలో... దప్పిక తీర్చే ఎండామావి నీ ప్రేమ...


ఒంటరి చీకటిని తరుముతూ...తోడు పంచే చల్లని వెన్నెల నీ ప్రేమ...


రంగు... రూపు లేకుండా... రంగుల హరివిల్లును చూపేదే నీ ప్రేమ...


అలసిన మదిలో తలచిన భావాలతో ... విచ్చుకున్న జ్ఞాపకాల వెల్లువ నీ ప్రేమ...


ఇంత అద్భుతమైన నీ ప్రేమకు నేను ఎప్పుడు బంధీనే నేస్తం...!

;;