దేవుడు దీనంగా నావైపు చూస్తూ...తలదించుకుంటున్నాడు..
నేను ఏమైనా అన్నానా?
ఆశలు పెంచుకుని...ఆకలి అని అరుస్తూ అన్నింటా విఫలుడై
ఆత్మహత్య చేసుకున్న అబ్బాయి గురించి అడిగానా?
యౌవ్వనం అమ్ముకుంటూ...అలసి జీవనం సాగిస్తూ సాగిస్తూ..
సంధ్యవేళలొ ఉరి తీసుకున్న సానిపడుచు గూర్చి అతనితొ చెప్పానా?
కార్గిల్ యుద్దంలొ చితికిన తన కొడుకు వార్తవిని
చీకట్లొ..ఏట్లొ దూకిన ముసిలిదాని పసరు గుండె నే చూపించానా?
కాలి కమురు కంపుకొట్టే కాలం కధ...మానవ వ్యధ...
నేను అతనితొ వివరించానా?
నిఖిల సృష్టిలొని ఖిలం గూర్చి..
నీరవ సుందర హృదయ పాత్రలొ నిండిన హాలహలం గూర్చి
నిజం చెప్పమని నేనడిగానా?
ఆకత్తయి మొగుడైనా ఆ వెధవ ప్రతిబింబాన్ని
అప్యాయంగా మోసే ఆడదాని ఒళ్ళు గూర్చి కాని..
ఆపుకొలేని యౌవ్వనంలొ తప్పటడుగువేసిన
పెళ్ళికాని పిల్ల కన్నీళ్ళు గూర్చి నేనేప్పుడైనా అడిగానా?
నీకు తెలుసు...నేను అడకపొయిన ఇవన్నీ నిజాలేననీ!
దేవుని చెక్కిళ్ళమీద దీనంగా జారే ఆ కన్నీటిని చూస్తూ..
వెళ్ళిరమ్మని వీధి చివరిదాకా సాగనంపి వచ్చాను..
మానవుడే దానవుడై తిరగబడినప్పుడు..
పాపం పెద్దవాడు...మనల్నీ కన్నవాడు..వాడు మాత్రం ఏం చేస్తాడు...